క్షణకాలం ఏమరుపాటు, మితిమీరిన వేగం నిండు ప్రాణాలను బలితీసుకుంటూ ఎన్నో కుటుంబాల్లో తీరని చీకట్లను మిగుల్చుతున్నాయి. ప్రకాశం జిల్లా కొండామంజులూరులో బంధువుల పుట్టినరోజు వేడుకల్లో సంతోషంగా గడిపి, జ్ఞాపకాలతో స్వగ్రామానికి బయలుదేరిన వారిని విధి రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ వద్ద జరిగిన ఘోర దుర్ఘటనలో వేలూరు గ్రామానికి చెందిన (1) బొంత బాబు, (2) మణెమ్మ, (3) సంపూర్ణమ్మ, (4) లక్ష్మి, (5) గంగమ్మ, (6) మరియమ్మ ఘటనా స్థలంలోనే విగతజీవులుగా మారారు. క్షణాల వ్యవధిలోనే ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోవడంతో ఆ కుటుంబాల గుండెలవిసే రోదనలు చూసి గ్రామం మొత్తం కన్నీరుమున్నీరవుతోంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో 9 మందిలో నలుగురి పరిస్థితి విషమించడంతో గుంటూరు GGHలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. నిత్యం రక్తమోడుతున్న రహదారులు ఎందరో ఆప్తులను దూరం చేస్తున్న వేళ, ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ విషాద ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

