చిలకలూరిపేట: విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగించే శారద హైస్కూల్ పక్కనే చెత్తాచెదారం గుట్టలుగా పేరుకుపోవడం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. పాఠశాల సమీపంలోనే చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుండటంతో విద్యార్థులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాన్ని డంపింగ్ యార్డుగా మార్చే పరిస్థితి ఎందుకు వచ్చిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చెత్త తొలగింపులో అధికారుల నిర్లక్ష్యమే కారణమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి, అక్కడ మళ్లీ చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

